Monday, September 22, 2014

హాస్యమాడినా అభేదమే

ఫుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్‌

 ఓ వికసించిన సరోజముల వంటి నేత్రములు కలవాడా! (విష్ణుమూర్తి ని పుండరీక-అక్షుడు అని ఇలా పిలవటం పరిపాటి), అల (ప్రసిద్ధిని సూచించే పదం) అప్పుడు, అక్కడ పూతన విషాన్ని స్థనాలలో నింపుకొచ్చినప్పుడు ఆ విషం తో పాటు పూతన ప్రాణాలను కూడా తాగినట్లు పురాణం. నాడు అల్ల - ఇంకా ముందర క్షీర సాగర మథనం జరిగినప్పుడు దవాగ్నిని మింగి లోకాలను రక్షించినట్లుగా పురాణం. (శివ స్వరూపం గా). ఇలా రెండు పర్యాయాలు భగవంతుడు చేదైన విషాన్ని తాగినట్లుగా మనకందరికీ తెలుసు.

శ్రీనాధ మహాకవి అంటున్నారు, అలా అని నిక్కెదవేలా? ఈ విషాలను తిన్నాననే గర్వం ఎందుకు? ఒక కొత్త సవాలుని చూపిస్తున్నాను. ఈ తింత్రిణి పల్లవములతో కూడిన (చింత చిగురు) వేడి వేడి బచ్చలి కూరనూ జొన్న సంకటి తో కలిపిన ముద్దని ఒక్కదాన్ని మెల్లిగా మింగవయ్యా. నీ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. నీ పస కాననయ్యెడిన్....

జొన్న కూడు తినలేక ఇబ్బంది పడుతున్న కవి సార్వభౌముడు భగవంతుడి తో హాస్యమాడుతూ కూడా శివ కేశవులలో భేదాన్ని చూడలేదు. విష్ణువుని సంబొధిస్తూ శివుని లీలను కూడా గుర్తుచేసుకున్నారు. పెద్దలెప్పుడూ కృష్ణునిలో శివుణ్ణీ, శివునిలో కృష్ణుణ్ణీ చూశారు. 

---- శ్రీ జయ నామ సంవత్సర భాద్రపద మాస శివరాత్రి (మహాలయ పక్షం) సందర్భం గా...

No comments: