Wednesday, May 30, 2012

భక్తి అంటే ఏమిటి?

అఙ్కోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా
సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్ వల్లభమ్
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే - 61

-- శివానందలహరి

భక్తి అంటే ఏమిటి?
శంకర భగవత్పాదులు ఇలా అంటారు. "మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే" (మోక్ష కారణలైన సామాగ్రులలో "భక్తి"  గొప్పది.  "స్వస్వరూప అనుసంధానమే" భక్తి అనబడుతుంది)

తన నిజ స్వరూపంతో విడదీయలేనట్లుగా కలిసి పోవడమే భక్తి. పై శ్లోకంలో ఇదే భావాన్ని శంకరులు శివానందలహరిలో చక్కగా ఉదాహరణలతో గొప్ప  యోగరహస్యాన్ని చొప్పించి మరీ చెప్పారు.
1. అంకొల వృక్షము యొక్క బీజములు చెట్టుచే ఆకర్షింపబడి నట్లుగా
2. అయస్కాంతము చేత సూది (అయస్కాంత క్షేత్రములోకి వచ్చిన వెంటనే చటుక్కున అతుక్కుపోయినట్లుగా)
3. సాధ్వి ఎల్లప్పుడూ తన విభుని చేరునట్లుగా (సాధ్వి అలోచనలు ఎల్లప్పుడూ తన విభునియందే ఉండునట్లుగా)
4. లత (పూలతీగ) చెట్టుని పెనవేసుకున్నట్లుగా
5. నదులు తమ వల్లభుడైన సముద్రములో లీనమైనట్లుగా (నామ రూపాలను వదలి)
చిత్త వృత్తులు పరమేశ్వరుని పాదారవింద ద్వయమునందు చేరి ఎల్లప్పుడూ ఉంటవో దానినే భక్తి అందురు.

ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తులనీ ; ఈ చిత్త వృత్తుల నిరోధమే "యోగ" మనబడుతుందనీ పతంజలి మహర్షి యోగ సూత్రం. అదే భక్తి అనబడుతుందని శంకరుల వివరణ. ఇలాంటి భక్తి వలననే మానవుడు తరిస్తాడు.

ఓం తత్సత్

4 comments:

  1. బాగుందండి. చక్కగా వివరించారు.

    ReplyDelete
  2. వివరణ శంకరులదమ్మా. నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  3. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తులనీ ;ఈ అయిదు వృత్తులను కలిపి విభ్రమ అంటారు.

    ప్రమాణ అనే వృత్తి ని ప్రమాణ, ప్రమేయ, ప్రమాత్రు అనే త్రిపుటికి లోబడే బలహీనతను విచారించి నిరశించి అధిగమించాలి.

    విపర్యయం అనే వృత్తిని భ్రూమధ్యమున దృష్టి, గురువాక్యమునకు కట్టుబడి జీవించే ఇంద్రియ నియమం ద్వారా నిగ్రహించాలి.

    వికల్పము అనేది ప్రారబ్ధ వశాత్తు కలిగే స్పందనలు వీటిని ఉదాసీనత, తితీక్షలను ఆశ్రయించి తీవ్ర వైరాగ్యంతో మట్టు పెట్టాలి.

    నిద్ర అనే దానిని ఆ సమయంలో చేసే జప, ధ్యాన సాధనలు, శ్వాస తో సమమైన జపం, కర్తుత్వ రహిత కర్మా చరణ అనే వాటితో తురీయాన్ని లక్ష్యించి జీవిస్తూ అధిగమించాలి.

    స్మృతి అనేది పూర్వ జన్మ వాసన లబ్ధ మైన వృత్తి దీనిన్ని గురుకృప చేతనే పోగొట్ట వచ్చు.

    ఎవరికీ వారు ఈ స్థితులను సాధనలను గమనించి ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం, స్వాత్మ అనుగ్రహం చేత తరించాలి.

    I posted your post in our online satsang I got the above reply from our Bodhakudu.

    thanks
    http://sadhakudu@googlegroups.com

    Sairam

    ReplyDelete
  4. అయ్యా సాధకుడు (Sriram) గారూ,
    వృత్తులను రజోగుణ, సత్త్వగుణ సంపత్తిచేత జయించటం - రాజయోగమైతే, ఈశ్వర ప్రణిధానంతో కూడా తొలగించుకోవచ్చని పతంజలి మహర్షి చెప్పి ఉన్నారు. ఈ వృత్తులను నేను పట్టుకోలేదు. అవి వచ్చి నన్ను పట్టుకున్నాయి. వాటికి లొంగిపోయిన మనసు తో వాటిని జయించడం సాధ్యం కాక, ఈశ్వర ప్రణిధానం ఎంచుకోవలసి వచ్చింది.

    you may like the post on iswara pranidhaanam - http://prasad-yoga.blogspot.in/2009/12/iswara-pranidhanam.html

    Prasad Chitta

    ReplyDelete