ఒక భాష యొక్క సాహిత్య చరిత్ర గురించి పరిశోధించడం ఎంతో కష్టమైన పని. పైగా సాహిత్య విమర్శ చేస్తూ చరిత్రని గ్రాంధీకరించడం నా చిన్న బుర్రకి అందని అసాధ్యమైన ప్రక్రియ.
1. అసలు వాజ్ఞ్మయం అంటే యేమిటి? మనం రాసుకునే పద్దులు, వ్యవహార లావాదేవీలూ కూడా, ప్రతీ మాటా వాజ్ఞ్మయమే అని ఒక వాదం. అలాకాదు, చందోబద్ధమైన రచనలే వాజ్ఞ్మయం అని ఇంకో వాదం. ఈ రెండిటికీ మధ్యలో పద్య గద్య కావ్యాలూ, శాస్త్రాలూ విజ్ఞాన తాత్విక సంపన్నమైన రచనలను గుర్తించి ఆ ఆ సాహిత్య ప్రక్రియలకు కళారూపాన్ని సిద్ధింపచేసి వాజ్ఞ్మయమునకొక నిర్వచనాన్ని ఇచ్చారు.
2. సరే. ఆంధ్ర భాష లాంటి ప్రాకృతిక భాషా వాజ్ఞ్మయానికి మూలాధారం సంస్కృత భాషలోని శాస్త్రాలూ కావ్యాలూన్ను. చరిత్ర గా చూస్తే, మన మాతృభాష గొప్పతనాన్ని చెప్పుకోవటానికి సంస్కృతాన్ని ఏదోఒక విధంగా నిందించడం ద్రావిడ ప్రాముఖ్యతని పొగడటం లేదా ప్రాచీనత్వాన్ని ఆపాదించడం జరుగుతుంది. అలా కాకుండా, సంస్కృతం యొక్క ఔన్నత్యాన్ని ఏ మాత్రం తగ్గించకుండా మన మాతృభాష సౌందర్యాన్ని ప్రతిష్టించిన విధానం విమర్శకులందరూ గుర్తించ వలసి ఉంటుంది.
3. ఇకపోతే, సాహిత్య చరిత్రను యుగములుగా విభజించటం, ఆ ఆ యుగములకు ఒక యుగ కర్త పేరు ఇవ్వడం, ఆ యుగంలోని సమకాలీన కవుల కావ్యాలను పరిశీలించి ముఖ్యమైన ప్రక్రియా భేదములను ప్రకటించడం, విశ్లేషించడం విమర్శకుని ప్రతిభ పైన ఆధార పడుతుంది. లక్ష్మీకాంతం గారు అద్భుతంగా ఈ కార్యాన్ని నిర్వర్తించారు. శ్రీనాధుడి యుగంగా పేరొందిన కాలమే పోతన భాగవత కాలం కూడా కావటం విశేషం. ఇంకా చివరి యుగానికి "క్షీణ యుగం" అనటం కూడా సమంజసంగానే తోస్తుంది.
ఏది ఏమైనా తెలుగు సాహిత్యం తెలుసుకోవాలనుకునే వారందరూ ఈ పుస్తకాన్ని తప్పకుండా అభ్యసించవలసి ఉంటుంది. ముఖ్యంగా నేటి ఆధునిక "సినిమా" కవులు, రచయితలు, విమర్శకులూ ఇటువంటి గ్రంధాలను ఆశ్రయిస్తే మన మాతృభాష ఎంతో సంతోషిస్తుంది.
శుభం భూయాత్
1 comment:
Best Telugu blog that I have come across. అత్యంత ప్రశంసనీయం అండి
Post a Comment