Sunday, November 15, 2009

శివ పూజ, హరి కీర్తన

చేతులారంగ శివునిఁ బూజింపడేఁని
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు

-- శ్రీ మదాంద్ర భాగవతం నుంచి శ్రీ విరోధి నామ సంవత్సర కార్తిక మాస శివరాత్రి సందర్భం గా

Saturday, November 14, 2009

శైశవగీతి

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!

మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!

అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!

గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు

ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు!
మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ల విభాప్రభాతములు!

ఋతువుల రాణి వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ
ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమత్తమే!

ఇవాళలాగే ఎప్పుడు కూడా
ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే
గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,
లనేక వర్ణా, లనంత రోచులు
దిక్కు దిక్కులా దివ్యగీతములు
మీరూ వాటికి వారసులే! ఇవి
మీలో కూడా మిలమిలలాడును!

నా గత శైశవ రాగమాలికల
ప్రతిధ్వనులకై,
పోయిన బాల్యపు చెరిగిన పదముల
చిహ్నాల కోసం,
ఒంటరిగా కూర్చిండి వూరువులు
కదిలే గాలికి కబళమునిస్తూ,
ప్రమాద వీణలు కమాచి పాడగ
సెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,
పాతాళానికి పల్టీకొట్టీ
వైతరణీనది లోతులు చూస్తూ,
శాంతములే, కేకాంతముగా, ది
గ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ
మెటిక విరుస్తూ ఇట కూర్చిండిన
నను చూస్తుంటే నవ్వొస్తోందా?
ఉడుతల్లారా!
బుడతల్లారా!

ఇది నా గీతం, వింటారా?

-- శైశవగీతి, శ్రీ శ్రీ. బాలల దినోత్సవం సందర్భంగా