Monday, November 3, 2008

తేకువ హరి నామమే

ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరి నామమే, దిక్కు మరి లేదు.

కొఱమాలి యున్న వేళ, కులము చెడిన వేళ,
చెఱ వాడి యొరుల చేజిక్కిన వేళ,
నొఱపైన హరినామ మొక్కటే గతి గాక,
మఱచి తప్పిననైన మఱి లేదు తెఱగు.

ఆపద వచ్చిన వేళ, యారడి బడిన వేళ,
పాపపు వేళల, భయపడిన వేళ,
ఓపినంత హరి నామ మొక్కటే గతి గాక,
మాపు దాక పొరలిన మఱి లేదు తెఱగు.

సంకెల బెట్టిన వేళ, చంప బిలిచిన వేళ,
అంకిలిగా అప్పులవా రాగిన వేళ,
వేంకటేశు నామమే విడిపించ గతి గాక,
మంకు బుద్ధి బొరలిన మఱి లేదు తెఱగు.

-- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

No comments: