Friday, January 9, 2009

విజయ రధం

రామ రావణ సంగ్రామ క్షేత్రం
రావణుడు కవచం, బ్రహ్మ దేవుడు ఇచ్చిన అస్త్రం, రధంతో రణరంగంలో అడుగుపెట్టాడు.
శ్రీ రామచంద్రుడు కూడా సమరాంగణంలో నుంచున్నాడు. రామచంద్ర ప్రభువుకి రధం లేదన్న విచారం విభీషణుడి మనసుని కలచి వేసింది.
వెంటనే
"ప్రభూ, తమకు రధం లేదు; కవచం లేదు; పాదరక్షలు కూడా లేకుండా నేల మీద నిల్చున్నారు. కాని విరోధి ఐన రావణుడు రధం మీద వచ్చాడు. బలవంతుడు కవచధారి కూడా. రావణుడి పై విజయం సాధ్యమా?"

ఈ ప్రశ్నకు శ్రీ రామచంద్రుడు ఇలా అన్నాడు:
"మిత్రమా, విజయాన్ని అందించే రధం ఏ విధం గా ఉంటుందో విను. విజయరధానికి శౌర్యధైర్యాలు చక్రాలైతే సత్యశీలాలు జెండాలుగా భాసిస్తాయి. బలం వివేకం ఇంద్రియ నిగ్రహం పరోపకారం ఈ నాలుగు ఆ రధానికి అశ్వాలు. ఈ గుర్రాలను రధానికి పూన్చడానికి ఉపయోగించే రజ్జువు క్షమ దయ సమత్వాల ముప్పేటల సమన్వయము తో తయారవుతుంది. ఇక దైవ సంస్మరణే చతురుడైన సారధి. వైరాగ్యమే డాలు, సంతోషం ఖడ్గం, దానం పరశువు, బుద్ధి ప్రచండమైన భుజ శక్తి. విశిష్టమైన విజ్ఞానమే ధనుస్సు. నైర్మల్య స్థిరత్వాలు తూణీరాలు. శమ దమ యమాదులు నిశిత శరాలు. గురు బ్రహ్మణులపై గల భక్తి శ్రద్ధలే కవచం.
విభీషణా! ధర్మ సమన్వితమైన ఇలాంటి రధమే విజయ రధం. దీన్ని అధిరోహించి ఉన్న రధికుణ్ణి జయించే శక్తి గల శత్రువు ఎక్కడా ఉండడు. ఈ రధం పై అధిరోహించి ఉన్న వీరుణ్ణి జనన మరణాలనే దుర్జయ శత్రువులూ జయించలేవు. ఇలాంటి రధం మీద ఉన్న నా ముందు రావణుడు అతని శక్తి పరాజయం కాక తప్పదు"

తులసీ రామాయణం నుంచి (ఈనాడు అంతర్యామి శీర్షికలో ఈరోజే వచ్చింది) - కాలిపు వీరభద్రుడు

1 comment:

paritalagopikrishna said...

Indeed it is a good one Prasad. I am glad, you brought me here. I enjoyed it reading. May God bless you. Love and Love alone ....