Thursday, June 18, 2009

నారద మహర్షి మాటల్లో 'ఈశ్వరుడు - విశ్వం'

గాంధారీ ధృతరాష్ట్రులు దేహ త్యాగము సేసికొనుట అనే ఘట్టము శ్రీ మదాంధ్ర భాగవతము ప్రధమ స్కంధము నుంచి

విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి యందుఁ బోయిరో వారల నిశ్చయంబులెట్టివో ఎఱుంగనని సంజయుండు దుఃఖించు సమయమున తుంబురు సహితుడై నారదుడు వచ్చిన,
వారిని పూజించి కౌంతేయాగ్రజుడు నారదుని తో ఇట్లనియె:


అక్కట తల్లి దండ్రులు గృహంబున లేరు మహాత్మ వారు నేఁ
డెక్కడ వోయిరో యెఱుఁగ నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ
బొక్కుచు నుండుఁ దల్లి యెటు వోయెనొకో విపదంబురాశికిన్
నిక్కము కర్ణధారుఁడవు నివు జగజ్జనపారదర్శనా.

అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె:

ఈశ్వరవశంబు విశ్వం బీశ్వరుండ భూతంబుల నొకటితో నొకటిఁ జేర్చునెడఁబాపు; సూచీభిన్ననాసిక లందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టంబడిన బలీవర్దంబులుంబోలెఁ, గర్తవ్యాకర్తవ్య వేద లక్షణ యగు వాక్తంత్రియందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులై, లోకపాలసహితంబైన లోకం బీశ్వరాదేశంబు వహించుఁ గ్రీడాసాధనంబు నక్షకందుకాదులకెట్లు సంయోగవియోగంబు లగుచుం; సమస్త జనంబును జీవ రూపంబున ధృవంబును, దేహరుపంబున నధృవంబునై యుండు; మఱియొక్క పక్షంబున ధృవంబు నధృవంబునుం గాక యుండు శుద్ధబ్రహ్మస్వరుపంబున రెండునై యుండు; నజగరంబు చేత మ్రింగబడిన పురుషుండన్యుల రక్షింప లేనితెఱుంగునఁ బంచభూతమయంబై కాలకర్మగుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్ధంబు గాదు; కరంబులుగల జంతువులు గరంబులు లేని చతుష్పదంబులు లాహరంబులగు, జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబులగు, నధిక జన్మంబు గల వ్యాఘ్రాదులకు నల్ప జనంబుగల మృగాదులు భొజ్యంబులగు, సకల దేహి దేహంబులందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవిక యగు సహస్తాహస్తాదిరూపం బైన విశ్వమంతయు నీశ్వరుండుగాఁ దెలియుమతనికి వేరు లేదు; నిజమాయావిశేషంబున మయావియై జాతి భేద రహితుండైన యీశ్వరుండు బహు ప్రకారంబుల భోగి భోగ్య రూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించుం గాన, యనాథులు దీనులు నగు నా తలితండ్రులు ననుం బాసి యేమయ్యెదరో, యెట్లు వర్తింతురో యని వగవం బనిలే దజ్ఞానమూలంబగు స్నేహంబుననైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మనెను.

2 comments:

మరువం ఉష said...

* ప్రసాద్ గారు, మీ టపాతో సంబంధంలేనిదే కానీ కౌంతేయులు మీద జరిగిన విశ్లేషణ, చర్చ మీకు ఆసక్తిని కలిగించవచ్చని, నాకు దాదాపు 2గం. పట్టింది అంతా చదివి అన్వయించుకుని ఆలోచించటానికి.

http://poddu.net/?p=142

Prasad Chitta said...

ఉష,
విశ్లేషణాత్మకమైన వ్యాసానికి లంకె అందించినందుకు సంతోషం.
తత్త్వ దృష్ఠి తో చూస్తే పాండవులు ఇంద్రియాలకి ప్రతీకలు. కౌరవులు అంధుడైన అజ్ఞానపు పుత్రులు. ఈ ధర్మక్షేత్రమైన శరీరాన్ని కౌరవులు అన్యాయంగా ఆక్రమిస్తే, శుద్దులైన పాండవులు భగవంతుడైన శ్రీ కృష్ణుని సహాయంతో తమ సహజ హక్కును తిరిగి పొందటమే మహా భారతం.
విశ్లేషణ ఎప్పుడూ మనని తత్త్వానికి దూరంగా తీసుకు పోతుంది. విచారణ మనని తత్త్వానికి దగ్గర చేస్తుంది.

Read about my favorite Thinking Tools - http://technofunctionalconsulting.blogspot.com/2008/03/thinking-tools.html