Sunday, April 10, 2011

అన్యోన్య దాంపత్యం

వరుడు:
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే
వధువు:
నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఇలా వధూవరుల స్వరూపాలు పరస్పర విరుద్ధంగా ఉన్నా "ఆది దంపతులు" ఎలా విడదీయలేకుండా ఉంటారో మహాకవి కాళిదాసు మాటల్లో:
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
యౌ: ఎవరు, వాగర్థావివ: శబ్దార్థములవలె, సంపృక్తౌ: కలిసియుండిరో, జగతః జగతికి, పితరౌ: తలిదండ్రులో, తౌ : ఆ, పార్వతీ పరమేశ్వరౌ : పార్వతిని పరమేశ్వరుని, వాగర్థ ప్రతిపత్తయే : శబ్దార్థములను సరిగా ఎరుగుటకు, వందే : నమస్కరించుచున్నాను.

అలాంటి అన్యోన్య దంపతులు లోకానికి మేలు జరగడం కోసం ఎలా ప్రవర్తిస్తారో పోతన భాగవతం లో:
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళ సూత్రమ్ము నెంతమది నమ్మినదో
ఈ పద్యం లో ముఖ్యంగా క్రింది విషయాలని గమనించాలి.
1. హాలాహలాన్ని వామ హస్తం లో గ్రహించిన శివుడు పార్వతి ఆమోదం కొరకు చూడటం
2. పార్వతీ దేవికి భర్త మీద (మంగళ సూత్రం మీద) గల నమ్మకం
3. ప్రజా హితమైన కార్యం కోసం త్యాగం చేయగలగడం

-- ప్రతీ దంపతుల జంటా ఈ "ఆది దంపతులను" ఆదర్శంగా తీసుకుని జీవిస్తే జగత్తుకు ఎల్లప్పుడూ సర్వ మంగళమే జరుగుతుంది.

No comments: