Wednesday, July 6, 2011

shaTpadI - షట్పదీ

జగద్గురువుల కవిత్వం
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః

దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః

మత్స్యాదిభిరవతారైరవతారవతాSవతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోSహం

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు

ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం విష్ణుషట్పదీస్తోత్రం సంపూర్ణమ్

నా పైత్యం
హే విష్ణో, అవినయం అపనయ, దమయ మనః, శమయ విషయ మృగతృష్ణాం, భూతదయా విస్తారయ, తారయ సంసార సాగరతః
ఆగంతకముగా నాలోకి వచ్చిన "అవినయము" (అహంకారము, గర్వము)ను పారద్రోలుము. విషయములనే ఎండమావులను శాంతింపజేయుము. మనస్సును కళ్ళెము వేయుము. నాలో కొంచెముగా ఉన్న భూతదయను విస్తరించుము (ప్రతివారికీ తనవారి మీద దయ ఉంటుంది. దాన్ని విస్తరిస్తే వసుధైక కుటుంబమే!) నన్ను ఈ సంసారమనే సా+గరము (గరము అంటే విషము; సాగరము అంటే విషముతో కూడినది అని అర్ధము) నుండి తరింపుము. (నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవా? అంటే - అదివచ్చి నన్ను పట్టుకుంది, లేదా నేను అందులో పడి పోయాను. అందువలన నాకు ఒక ఆలంబనను లేదా నౌక లాంటి దానిని నీవే ఇవ్వ వలసి ఉంటుంది. )

వందే! శ్రీ పతి పదారవిందే, దివ్య ధునీ మకరందే, పరిమళ పరిభోగ సచ్చిదానందే, భవ భయ ఖేద చ్చిదే
దివ్య ధునీ అయిన మందాకిని అనే మకరందము గలవీ (త్రివిక్రమ లీల) , ఎంత అనుభవించినా తనివితీరని (పరిభోగము నకు అనువైన) పరిమళము గలిగినవీ, ఈ సంసారమందు కలుగు భయమునూ ఖేదమునూ ఛేదించ గలిగినవీ అయిన శ్రీపతి (మనకు అన్ని భోగాలనూ ఇచ్చే భూమి నుంచి వచ్చే సంపదకు "శ్రీ" అని పేరు) పదారవిందములకు నేను వందనము చేయు చున్నాను.

హే నాథ! సత్య అపి బేధ అపగమే తవ అహం న మామకీ నః త్వం; సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః
ఓ నాథా, " నీవు", "నేను" అనే బేధం పోయి పరమార్థ సత్యం దర్శనం వరకూ నేను నీయందే ఉన్నాను (తవ అహం) కానీ ఎప్పుడూ నీవు నావాడవు (మాత్రమే) కావు. అది ఎలాగంటే, ఎల్లప్పుడూ తరంగాలన్నీ సముద్రానివే కానీ సముద్రమెప్పుడూ ఏ ఒక్క తరంగానిదీ కాదు కదా!

కిం న భవతి భవ తిరస్కారః ? భవతి దృష్టే ప్రభవతి, హే ఉధృతనగ, నగభిత్ అనుజ, దనుజ కుల అమిత్ర, మిత్ర శశి దృష్టే!
ఓ కొండను ఎత్తిన వాడా (గోవర్ధన ఉద్ధారణ లీల - ఇంద్రుని గర్వం అణచి న సందర్భం) , కొండల శత్రువైన ఇంద్రుని తమ్ముడిగా పుట్టి అన్నకు రాజ్యమిప్పించినవాడా (వామన అవతార లీల) , ఓ రాక్షస కులమునకు శత్రువైన వాడా (రామావతార లీల) ఓ సూర్య చంద్రులు కళ్ళ గా కలిగినవాడా ( ఎల్లప్పుడూ అన్ని జీవులనూ గమనించే వాడా!) నీ కృపా దృష్టి నా మీదకు ప్రభవిస్తే ఈ సంసార తిరస్కారము ఎందుకు జరగదు? (వైరాగ్యం వచ్చి తీరుతుంది అని సమాధానము!!)

హే పరమేశ్వరా! భవతా పరిపాల్యో అహం భవ తాప భీతః; అవతారవతా మత్స్య ఆదిభిః అవతారైః అవతా సదా వసుధాం!

మత్స్యము మొదలైన అవతారాలను ధరించి (చిన్న చేపను కాపాడిన రాజును ప్రళయ కాలం లో కాపాడుతూ, ఎకకాలంలో వేదోద్ధరణం చేసిన లీల) పాప భారం ఎక్కువైపోయిన భూదేవిని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండే నువ్వు ఓ పరమేశ్వరా నేను కూడా భవ తాపం తో భీతి చెంది ఉన్నానాయ్యా (నాలోనే పుట్టిన పాపపు ఆలోచనలను నిగ్రహించలేకుండా ఉన్నానయ్యా!) నన్నూ అదే విధం గా పరిపాలించ వయ్యా పరమేశ్వరా (పరమేశ్వర అనే నామం శివునకు సంబంధిచినదైనా, శివ కేశవ అబేధం వల్ల ఇక్కడ అన్వయిస్తుంది )

హే దామోదర, గుణమందిర, సుందర వదనారవింద, గొవిందా! భవ జలధి మథన మందర! త్వం మే పరమం దరం అపనయ
ఓ దామోదరా (పరబ్రహ్మమై ఎవరికి చిక్కని వాడివి, యశొదమ్మ చేత చిక్కి దామము లో ఉదరము ను బంధింపబడిన వాడవై - భక్త సులభుడవైన లీల) అన్ని గుణములకూ మందిరమైన వాడా! (తెల్లని సూర్య కాంతి నుంచి సప్త సప్తి మరీచులు లెక్క లేనన్ని రంగులు / గుణములు ఎల వస్తాయో అయినాప్పటికీ సూర్య కాంతి ఎలా నిర్గుణ మైనదో) ఎల్లప్పుడూ చూడాలనిపించే సుందర వదనారవిందము కలవాడా (సౌందర్యం లో రక్షకత్వం ఉంటుంది) ఓ గోవిందా (జగద్గురు తత్త్వం; శంకరాచార్యుల గురు స్వరూపం కూడా గోవిందుడే!) ఈ భవ జలధిని మధించ దానికి మందర పర్వతం లాగా, కవ్వం గా నాకు సహాయం చేస్తున్నవాడా! పరమమైన భయమైన మృత్యు భయమును నానుంచి దూరము చేయవయ్యా! (అంటే జ్ఞానము ప్రసాదించ మని ప్రార్ధన!!)

నారాయణా, కరుణామయా, నీ చరణములయందు శరణడిగిన నా వదన సరోజమునందు ఈ షట్పది (తుమ్మెదను) ఎల్లప్పుడూ నివసించునట్లు చేయి.
(నా మాటలలనే పద్మాలలో భక్తి అనే మకరందాన్ని తుమ్మెద రూపం లో ఎల్లప్పుడూ ఆస్వాదించు స్వామీ; అది నన్ను తరింప జేస్తుంది అని భావము)

-- భగవంతుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము ద్వారా నేననే ఈ తోలు తిత్తికి గల కర్ణ రంధ్రములలో ప్రవేశించి జగద్గురువు శంకర భగవద్పాదుల వాణి మదీయ గురుచరణుల వైభవాన్ని ఆవిష్కరించింది.

ప్రతి జిజ్ఞాసువూ తన జీవిత కాలం లో ఒక్కసారి భావపూర్వకంగా ఈ స్తొత్రం తో ధ్యానము చేస్తే జీవిత పరమార్థమైన మోక్షం లభించి తీరుతుంది.

3 comments:

m.v.sagar said...
This comment has been removed by the author.
m.v.sagar said...

మీ పైత్యము చాలా బాగుంది కొనసాగించండి
ఇది నా సేకరణ ఇందులో ఈ స్తోత్రాన్ని వాడుకుంటున్న (టైపు చేసే ఓపిక లేక) ఒసారి దర్శించగలరు

http://jairamahanuman.blogspot.in ఇది తెలుగు వచ్చే వాళ్ల కోసము
http://panchaananahanumaan.blogspot.in/ ఇది తెలుగు రాని వాళ్ల కోసము
ఆచార్య విద్యాసాగర్ ముడుంబై

Prasad Chitta said...

ఆచార్య విద్యాసాగర్ గారూ, చాలా సంతోషం!