సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ||
-- శివానందలహరి
అత్యంత చపలమైన నా హృదయ కపి ఎల్లప్పుడూ మోహారణ్యంలో యువతుల కుచ గిరులపైన తిరుగుతూ, ఆశా శాఖలను (ఊడలనూ) పట్టుకుని ఊగుతూ, స్వైర విహారం చేస్తొంది. ఓ శివా, నీవు కపాలివి, భిక్షుడవు; ధృఢమైన భక్తి అనే బంధనం తో దీనిని బంధించి నీ అధీనం చేసుకోవయ్యా! (ఈ కోతి నీ వెనకాల తిరుగుతూ ఉంటే ఉపయోగం గా ఉంటుందేమో! దీనిని నేనే పట్టి నీకప్పగించే శక్తి నాకు లేదు!! స్వామీ శరణు!!!)
ఇదే భావాన్ని భక్త రామదాసు:
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ.
ధూర్జటి:
తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగియించి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!
Wednesday, June 29, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment