Saturday, April 7, 2012

అప్పడపు పాట



అప్పడమొత్తి చూడు అదితినినప్పుడె నీ యాశ వీడు (పల్లవి)

ఇప్పుడమి యందున యేమరి తిరుగక
సద్భోధానందుడౌ సద్గురు నాధుడు
చెప్పక చెప్పెడు తత్త్వమగు సమము
గొప్పది లేనట్టి యొకమాట చొప్పున (అను పల్లవి)

చరణం 1.
తానుగాని పంచ కోశ క్షేత్రమునందు
తానుగా పెరుగభిమాన మినుములను
నేనెవ్వడనెడు విచార తిఱుగలిలో
నేనుగానని పగలగొట్టి పిండియుచేసి (అ)

చరణం 2.
సత్సంగమనియెడు నల్లేరు రసముతో
శమదమములను జీలకఱ్ఱ మిరియములతో
ఉపరతి యనునట్టి యుప్పును కలిపి
సద్వాసన యనియెడి యింగువను చేర్చి (అ)

చరణం 3.
రాతి చిత్తము నేను-నేనని భ్రమయక
లోదృష్టి రోకటి తోను మానక దంచి
శాంతమౌ కొడుపుతో సమమగు పీటపై
సంతత మలయక సంతసంబు తోడ (అ)

చరణం 4.
మౌనముద్ర యనెడి ముగియని పాత్రమున
జ్ఞానాగ్ని చే కాగు సద్బ్రహ్మ ఘృతమున
నేనది యగునని నిత్యమును పేల్చి
తనుదానె భుజియింప తన్మయ మగునట్టి (అ)

-- భగవాన్ శ్రీ రమణ మహర్షి (శ్రీ ప్రణవానందుల అనువాదం)

మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగింటినీ ఇలా అప్పడాలుగా కాల్చుకుని భుజించేశారు కాబట్టే భగవాన్ రమణులను చూచిన కావ్యకంఠ గణపతి ముని "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే" అన్న శ్లొకాన్ని భగవాన్ రమణులకు అన్వయిస్తూ "చతుర్భుజం" అన్న పదానికి ఈ అర్థాన్ని చెప్పారు!

3 comments:

ఎందుకో ? ఏమో ! said...

ధన్యవాదములు

?!

మరువం ఉష said...

భగవాన్ రమణుల ఈ అప్పడపు పాట ఉదయపు ధ్యాన సమయాన నా ఆత్మకి అందిన దీవెన గా స్వీకరిస్తూ, చక్కగా పాడిన మీకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను, ప్రసాద్ గారు.
"మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగింటినీ ఇలా అప్పడాలుగా కాల్చుకుని భుజించేశారు కాబట్టే భగవాన్ రమణులను చూచిన కావ్యకంఠ గణపతి ముని "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే" అన్న శ్లొకాన్ని భగవాన్ రమణులకు అన్వయిస్తూ "చతుర్భుజం" అన్న పదానికి ఈ అర్థాన్ని చెప్పారు! " - చక్కటి వివరణ

Prasad Chitta said...

చాలా సంతోషం ఉష గారు.