Saturday, November 22, 2008

మనో నిగ్రహం

ప్రశ్న :
ఏ పద్ధతిని - ఏ మార్గాన సాధన చేసినా మనసు ను వశం చేసుకోవాలని చూస్తారు. దాన్ని నిగ్రహించమని చెపుతారు. ఒకవైపున మనసు ఒక తెలియని వ్యక్తిగా - మరొక వైపున తనకు అనేకమైన వ్యవహారిక బాధలు, గొడవలు వుండగా - మనం నిజంగా మనో నిగ్రహం సాధించ గలమా?

సమాధానం:
సముద్రం ఎప్పుడూ చూడని ఒకాయన దాన్ని చూసి తెలుసుకోవడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ విశాల జల రాశి ముందు నిలిచి అందు స్నానం చేయాలని అనుకొన్నాడు. ఆ తీరాన నిలిచి చలించి, ఘోషిస్తున్నట్టి ఆ తరంగాల్ని చూసి "ఈ అలలన్నీ అణిగినప్పుడు ఇంటి వెనక చెరువు లో స్నానం చేసినట్లు - సముద్రం లో దిగి స్నానం చేస్తాను" అనుకున్నాడు.

సముద్రం నిరంతరం అలసట లేకుండా తరంగాలతో సృస్టి మొదటినుంచి, ప్రళయం వరకు ఆవిధంగా చలిస్తూ వుంటుందనే సంగతి ఇతరులు చెప్పడం వల్లగాని, లేదా - తనకు తానుగా తెలుసుకోవడం వల్ల గాని విషయం గ్రహించ వలసి వుంది.

అతడా విషయం తెలుసుకున్న తర్వాత అతడా సముద్రం లో దిగి స్నానం చేస్తాడు. అతడు చేతులు మెల్ల మెల్ల గా వూపుతూ, గత సూచనల ద్వారా ఆ తరంగాలలో మునుగుతూ తన తలపై నించి తరంగాలను పోనిస్తాడు. అతడు శ్వాసను సహజంగా బంధిస్తాడు. అట్లా చేయడం వలన అతడు నేర్పరి అవుతాడు. చివరకి తన లక్ష్యాన్ని సాధిస్తాడు - ఎటువంటి దుఃఖం బాధ కష్టం కలగకుండా.

సముద్రం చలిస్తూ ఉన్నా అతడు దాని బంధం నుండి విముక్తుడు అవుతాడు. "మనస్సు విషయం లో కూడా అంతే".

భగవాన్ రమణ మహర్షి (100 ప్రశ్నలకు రమణ మహర్షి సమాధానాలు నుంచి)

Sunday, November 9, 2008

మూర్ఘుల మనసు రంజింపరాదు

తివిరి ఇసుమున దైలంబుఁ దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఘుల మనసు రంజింపరాదు.
--- ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి సుభాషితం నుంచి

వసుధం గుందేటికొమ్ము తెచ్చుకొనఁగా వచ్చుం బ్రయత్నంబున
న్వెసఁ ద్రావన్జల మెండమావుల నెయేనిం గాంచ వచ్చు న్నిజం
బిసుక న్నూనియఁ బిండ వచ్చుఁ బ్రతిభా హీనాత్ముఁ డౌ మూర్ఘుఁ దె
ల్ప సమర్ధత్వమ్ము లే దిల స్సురభి మల్లా నీతివాచస్పతీ.
-- అదే పద్యాన్ని మహోపాధ్యాయ ఎలకుఉచి బాలసరస్వతి కృత మల్లభూపాలీయం నుంచి

Friday, November 7, 2008

గర్వము

తెలివి యొకింత లేనియెడఁ దృప్తుడ నై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁ దొల్లి యిప్పు డు
జ్జ్వలమతు లైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియని వాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వమున్

--- ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి సుభాషితం నుంచి

Wednesday, November 5, 2008

ఆత్మ జ్యోతిస్సు

అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యస్తమితే శాన్తే అగ్నౌ శాన్తాయాం వాచి కిం జ్యోతి రేవాయం పురుష ఇత్యాత్మైవాస్య జ్యొతిర్భవతీ త్యాత్మనైవాయం జ్యొతిషా న్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి

యాజ్ఞవల్క్యా! సుర్యుడస్తమించగా చంద్రుడును అస్తమింపగా, అగ్నియు (దీపము) శమింపగా, వాక్కు శమింపగా, ఈ పురుషుడు ఏ జ్యోతిస్సుతో వ్యవహరించుచున్నాడు? అని జనకుడు ప్రశ్నించెను.

"ఆత్మ ఏవ అస్య జ్యోతిః భవతి" అని యాజ్ఞావల్కుడు సమాధాన మిచ్చెను.

ఆత్మ జ్యోతిస్సుతో ఉండును, సర్వకార్యములు నిర్వర్తించుచుండును. అంతఃస్థమయిన జ్యోతీరూప ఆత్మ బాహ్య జ్యోతిస్సు కంటే విలక్షణము.

-- బ్రహ్మశ్రీ సూరి రామకోటి శాస్త్రి గారి బృహదారణ్యకోపనిషత్ శ్రీ శంకర భగవత్పాద భాష్య భావ ప్రకాశిక నుంచి యాజ్ఞవల్క్య జయంతి సందర్భంగా

Tuesday, November 4, 2008

పోతనామాత్యుని పేదఱికము

పోతనామాత్యుడు ఎంత పేదఱికము అనుభవించియు రాజులం బొగడ నొల్లక కేవల కర్షకుండై తన కాలమంతయు గడపెను.

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్

శ్రీనాధుడు పరిహాస పూర్వకము గా "హాలికులు సుఖమున్నారా?" అని అడుగగా

బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్యకం
గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటే సత్కవుల్
హలికులైన నేమి గహనాంతరసీమలఁ గందమూలకౌ
ద్దాలికు లైన నేమి నిజదారసుతోదర పోషనార్ధమై.

అందుకే కళను అమ్ముకో కూడదు.... మన కౌశలాన్ని భగవంతునికి అర్పించాలి

Monday, November 3, 2008

పరతత్త్వ మొక్కటే

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాషలిట్టె వేరు పరతత్త్వ మొక్కటే
విశ్వదాభి రామ వినుర వేమ

-- యోగి వేమన

తేకువ హరి నామమే

ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరి నామమే, దిక్కు మరి లేదు.

కొఱమాలి యున్న వేళ, కులము చెడిన వేళ,
చెఱ వాడి యొరుల చేజిక్కిన వేళ,
నొఱపైన హరినామ మొక్కటే గతి గాక,
మఱచి తప్పిననైన మఱి లేదు తెఱగు.

ఆపద వచ్చిన వేళ, యారడి బడిన వేళ,
పాపపు వేళల, భయపడిన వేళ,
ఓపినంత హరి నామ మొక్కటే గతి గాక,
మాపు దాక పొరలిన మఱి లేదు తెఱగు.

సంకెల బెట్టిన వేళ, చంప బిలిచిన వేళ,
అంకిలిగా అప్పులవా రాగిన వేళ,
వేంకటేశు నామమే విడిపించ గతి గాక,
మంకు బుద్ధి బొరలిన మఱి లేదు తెఱగు.

-- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

Sunday, November 2, 2008

బ్రహ్మ మొకటే

బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పరబ్రహ్మ మొకటే.

కందువగు హీనాధికము లిందు లేవు,
అందరికీ శ్రీహరే అంతరాత్మ ;
ఇందులో జంతుకుల మింతా నొకటే,
అందరికీ శ్రీహరే అంతరాత్మ.

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే,
అండనే బంటు నిద్ర అదియు నొకటే;
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యోకటే,
చండాలు డుండేటి సరి భూమి యోకటే;

అనుగు దీవతలకు అల కామసుఖ మొకటే,
ఘనకీటపశువులకు కామసుఖ మొకటే;
దిన మహూరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే,
ఒనర నిరు పేదకును ఒక్కటే అవియు.

కొరలి శిష్టాన్నములు కొను నాక లొకటే,
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే;
పరగ దుర్గంధములపై వాయు వొకటే,
వరుస పరిమళములపై వాయు వొకటే.

కడగి ఏనుగు మీద కాయు ఎం డొకటే,
పుడమి శునకము మీద పొలయు ఎం డొకటే;
కడు పుణ్యులను, పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వెంకటేశ్వరు నామ మొకటే.


-- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

Saturday, November 1, 2008

ఆది కవిత

శ్రీ హరిహరహిరణ్యగర్భేభ్యొ నమః
శ్రీ మదాంధ్ర మహా భారతము - ఆది పర్వము - ప్రధమా శ్వాసము - మంగళ శ్లోకము

శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్బవామ్
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సమ్పూజితా వస్సురై
ర్భూయాసుః పురుషొత్తమామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే

-- సకలసుకవిజనవినుత నన్నయ భట్ట
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము మరియు తెలుగు భాష ప్రాచీనత గుర్తింపు సందర్భం గా