Saturday, June 11, 2011

రామేశ్వరం ఏ సమాసం?

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయో రప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్‌

-- దశ పాపహర దశమి, శ్రీరామ చంద్ర మూర్తి రామేశ్వరం లో ప్రతిష్ఠించిన రోజు

రామేశ్వరం ఏ సమాసం? తత్‌ పురుషమా? "రామస్యఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు- అని అర్థం ఏర్పడుతుంది. అపుడు అది శివాధిక్యం చెపుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివునికంటె ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈసందేహాలన్నీ తీర్చెవా రెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూడామని అనుకొని వైకుంఠం వెళ్ళారు. "ఇంత చిన్న విషయానికి ఇంతదూరం ఎందుకు వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెసుస్తున్నదే తత్పురుష అని. రామస్య ఈశ్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట. కాని దేవతలకు మాత్రం సందేహనివృత్తి కాలేదు.

విష్ణువు నడిగాం సరిగదా, ఇక ఆ శివుణ్ణే అడుగుదాం, ఆయన ఏంచెప్తాడో చూదాం అని అనుకొని "విష్ణు స్తత్పురుషం బ్రూతే" అని అనుకొంటూ కైలాసానికి వెళ్ళగా, శివుడు "ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహిసమాసం రాముడే ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు' అని ఆయన బదులు చెప్పాడట.

దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఈలాటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనయినా తోచలేదు. "వీరిద్దరికి పేరుతో ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకొందామని "బహువ్రీహిం మహేశ్వరః" శివుడుబహువ్రీహీ సమాసం అని చెప్పుకొంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట.

బ్రహ్మదేవతలకు కలిగిన సందేహాన్ని జరిగినసమచారాన్నీ శాంతంగావిని "ఇది తత్పురుషసమాసము కాదు, బహువ్రీహిన్నీ కాదు, మరి కర్మధారయసమాసం, వీరరాఘవు డంటే వీరుడు ఒకడూ రాఘవుడు మరొకడూనా? కాదుగదా? ఆలాగే రామేశ్వరు డంటే రాము డొకడూనూ ఈశ్వరుడింకోడూనా? రాముడే యీశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా "రామశ్చాసావీశ్వరశ్చ" రామేశ్వరః అని కర్మధారయమే యిది అని తీర్పు చేశారుట బ్రహ్మగారు.

-- జగద్గురు బోధలు నుంచి

No comments: