గరులన్ గల్గినవాడటంచు బహుభోగాఢ్యుండటంచున్ మహా
హరులన్ గల్గినవాడటంచు నధికారారూఢుడంచున్ సదా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 1
సిరులన్ చేకుర చేతురో విభవమున్ సిద్ధింపగా చేతురో
పరమారోగ్యము సంఘటింతురో జరావ్యాధుల్ నివారింతురో
పరిపూర్ణాయువు గల్గజేయుదురొ దంభప్రజ్ఞులే గాని యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా -2
సిరిమంతుల్ సిరులిచ్చినన్ నిలుచునే శ్రీమంతులొక్కప్డు దు
ర్భర దారిద్ర్య దశావశాత్ములగుచున్ రారాని దుఃఖమ్ములన్
దురపాయంబుల చిక్కి స్రుక్కుటలు నెందున్ చూడమే మూఢతన్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 3
సిరులే లేశము నివ్వ నేర్చునవి రక్షింపంగ దా నేర్చునే
సిరులన్ నిల్పగ నేర్చుగాక నరుడా శ్రేయంబులీ నేర్చునే
స్మరణీయుండితరుండు లేడు హరియే సర్వార్థ సంధాత యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 4
కరుణాసాగరుడార్తబంధుడు జగత్కళ్యాణ సంధాత సం
సరణాంబోనిధినౌక సాధుజనహృత్సత్పద్మసంవాసి దు
ర్భర సంసారహరుండు భక్త సుమనోవాంఛా ప్రదుండుండగా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 5
దురహంకారులు గర్వచిత్తులు సదాదోషైక దృక్కుల్ మహా
దురితాచార పరాయణుల్ చపల చిత్తుల్ (చోరులుం) ధూర్తులున్
పరమార్థ ప్రతికూలవర్తనులు లోభగ్రస్తులాశాపరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 6
కరుణాదూరులు వంచనాపరులు శుష్కాతి ప్రియాలాపకుల్
పరవిద్యాబలవిత్త వృద్ధులు సహింపన్ లేని నీచాత్మకుల్
పరదాక్షిణ్య పరోపకార రహితుల్ స్వార్థప్రియుల్ మచ్చరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 7
నరులెవ్వారలు సర్వసంపదలతో నానాధికారాలతో
సరస ప్రజ్ఞలతో మహామహిమతో జానొందిరేనిన్ పరా
త్పరు నిన్ గూరిచి వారు చేసిన సుపూజాలబ్ధముల్ సర్వమున్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 8
దొరలందిట్టి సమర్థుడున్ సరసుడున్ దూరార్థ సందర్శియున్
వరదాక్షిణ్యుడు స్వాశ్రితావన మహాప్రావీణ్యుడున్ పుణ్యుడున్
దొరకంజాలడు సుమ్ము ముజ్జగములందున్ నమ్ము నామాట నీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 9
-- మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి గ్రామవాసులు కీ. శే. శ్రీమాన్ తిరునగరి వెంకయ్య గారు వ్రాసియుంచుకున్న లిఖితప్రతి యందు 9 పద్యాలు. (కవి ఎవరో తెలియదు.)
No comments:
Post a Comment