Friday, October 31, 2008

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు,
అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు.

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని;
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు;
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు;
అలరి పొగడుదురు కాపాలికులు అదిభైరవు డనుచు.

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు;
దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు;
సిరుల మిమ్మనే అల్పబుద్ది దలచినవారికి అల్పం బవుదువు;
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు.

నీవలన కొరతే లేదు మరి నీరుకొలది తామెరవు,
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు;
శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈవల నే నీ శరణనియెదను ఇదియే పరతత్త్వము నాకు.

-- శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య
Post a Comment