Wednesday, March 4, 2009

"పద" అరణ్యం - తత్త్వ "మార్గం"

శాస్త్ర సంచయంలోని పద సమూహాలు అరణ్యం వంటివి. మనస్సు అందు దారి తెలియక పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుచేత తత్త్వజ్ఞుల నుండి ఆత్మ తత్త్వాన్ని ప్రయత్నించి తెలుసుకోవాలి.

-- శ్రీ శంకర భగవత్పాదులు, శ్రీ శంకర ఉవాచ నుంచి

Tuesday, March 3, 2009

ఇతరులకు నినునేరుగతరమా

ఇతరులకు నినునేరుగతరమా
ఇతరులకు నినునేరుగతరమా ఇందిరా రమణ

సతత సత్యవ్రతులు సంపూర్ణ మొహవిరహితులేరుంగుదురు నిను ఇందిరా రమణ
ఇతరులకు నినునేరుగతరమా

నారికఠాక్షపటునారాచభయరహిత శూరులేరుగుదురు నిను చూచేటి చూపు
ఘోర సంసార సంకులపరిచ్చేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము
ఇతరులకు నినునేరుగతరమా

రాగభోగవిదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రనుతించు విధము
ఆగమోక్త ప్రకారాభిగంయులు మహాయోగులెరుగుదురు నీవుండేటి వునికి 
ఇతరులకు నినునేరుగతరమా

పరమ భాగవత పదపద్మ సేవానిజాభరనులెరుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్తిరులెరుంగుదురు నిని తిరు వెంకటేసా
ఇతరులకు నినునేరుగతరమా

సతత సత్యవ్రతులు సంపూర్ణ మొహవిరహితులేరుంగుదురు నిను ఇందిరా రమణ
ఇతరులకు నినునేరుగతరమా ఇతరులకు నినునేరుగతరమా
 

Monday, March 2, 2009

నే నేమిటి?

నేను శరీరం కంటే భిన్నుడను కనుక జన్మ వార్ధక్య చావు వంటి వికారాలు నాకు లేవు. ఇంద్రియ రహితుడను కనుక శబ్దరసాల వంటి ఇంద్రియవిషయాల పట్ల ఆసక్తి నాకు లేదు.
మనస్సు కంటే భిన్నుడను కనుక దుఃఖం, ఆసక్తి, ద్వేషం, భయాలు నాకు లేవు. ఉపనిషద్ వాక్యం ఇది : అప్రాణొహ్యమనాః శుభ్రోహ్యక్షరాత్పరతః పరః

दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः ।
अप्राणो ह्यमनाः शुभ्रो ह्यक्षरात् परतः परः

Mundaka Upanishad : ii-1-2

Monday, February 23, 2009

మహాశివరాత్రి

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునః పునః

ఎవని సద్రూపమైన ప్రకాశమే అసద్రూపాలైన అర్థాలుగా కన్పించుచున్నదో,
తత్త్వమసి అనే వేద వాక్యంచే ఎవడు భక్తులకు ప్రత్యక్షంగా తెలుపుచున్నాడో,
ఎవనిని సాక్షాత్కరించుకుంటే సంసారసాగరాన పునర్భవముండదో,
ఆ గురుమూర్తియైన దక్షిణాముర్తికి ప్రణమిల్లుచున్నాను.


-- మహాశివరాత్రి సందర్భంగా

Thursday, February 12, 2009

ఆపద - సంపద

आपदः सम्पदः काले दैवादेवेती निश्चयी |
तृप्तः स्वस्थेन्द्रियो नित्यं न वाञ्छति न शोचति ||


ఆపదః, సంపదః, కాలే, దైవాత్, ఎవ, ఇతి, నిశ్చయీ
తృప్తః, స్వస్థేంద్రియః, నిత్యం, న, వాఞ్చతి, న, శోచతి

ఆపదలు సంపదలు కాలంలో దైవం వలన (మన పూర్వ కర్మ ఫలితాల వలన) మాత్రమే అని నిశ్చయించుకున్న వాడు నిత్యం త్రుప్తుడై, ఇంద్రియాలను నిగ్రహించి ఏమీ కోరడు, దుఃఖించడు.

(Astavakra Samhita - Chapter XI - Verse 3)

Thursday, January 29, 2009

గురువు - శిష్యుడు

వేదవిదుడు, పాపరహితుడు, కామనారహితుడు, బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడు, బ్రహ్మనిస్ఠుడు, ఇంధనం లేని అగ్ని లా శాంతుడు, అవ్యాజ కరుణా సముద్రుడు, శరణాగత సుజనులకు మిత్రుడు యైన వాడే నిజమైన గురువు.

మోక్షకామి, విధేయుడు, ప్రశాంతచిత్తుడు, శమదమాది గుణాన్వితుడై తనను శరణు వేడిన వానికి గురువు కేవలం అనుగ్రహమాత్రంచే తత్త్వోపదేశం చేస్తాడు.

అజ్ఞానాంధకారాన్ని నిర్మూలించి, సాక్షాత్కార కమలాన్ని వికసింపజేసే విష్ణుస్వరూపుడే గురుదేవుడు. ఆ గురు భాస్కరునిచే నా మనస్సనే ఆకాశం వెలుగు నొందినది.

--శంకర భగవత్పాదుల వారి శంకర ఉవాచ నుంచి

శ్రీ సర్వధారి నామ సంవత్సర మాఘ శుద్ధ తదియ గురు వారం

Friday, January 9, 2009

విజయ రధం

రామ రావణ సంగ్రామ క్షేత్రం
రావణుడు కవచం, బ్రహ్మ దేవుడు ఇచ్చిన అస్త్రం, రధంతో రణరంగంలో అడుగుపెట్టాడు.
శ్రీ రామచంద్రుడు కూడా సమరాంగణంలో నుంచున్నాడు. రామచంద్ర ప్రభువుకి రధం లేదన్న విచారం విభీషణుడి మనసుని కలచి వేసింది.
వెంటనే
"ప్రభూ, తమకు రధం లేదు; కవచం లేదు; పాదరక్షలు కూడా లేకుండా నేల మీద నిల్చున్నారు. కాని విరోధి ఐన రావణుడు రధం మీద వచ్చాడు. బలవంతుడు కవచధారి కూడా. రావణుడి పై విజయం సాధ్యమా?"

ఈ ప్రశ్నకు శ్రీ రామచంద్రుడు ఇలా అన్నాడు:
"మిత్రమా, విజయాన్ని అందించే రధం ఏ విధం గా ఉంటుందో విను. విజయరధానికి శౌర్యధైర్యాలు చక్రాలైతే సత్యశీలాలు జెండాలుగా భాసిస్తాయి. బలం వివేకం ఇంద్రియ నిగ్రహం పరోపకారం ఈ నాలుగు ఆ రధానికి అశ్వాలు. ఈ గుర్రాలను రధానికి పూన్చడానికి ఉపయోగించే రజ్జువు క్షమ దయ సమత్వాల ముప్పేటల సమన్వయము తో తయారవుతుంది. ఇక దైవ సంస్మరణే చతురుడైన సారధి. వైరాగ్యమే డాలు, సంతోషం ఖడ్గం, దానం పరశువు, బుద్ధి ప్రచండమైన భుజ శక్తి. విశిష్టమైన విజ్ఞానమే ధనుస్సు. నైర్మల్య స్థిరత్వాలు తూణీరాలు. శమ దమ యమాదులు నిశిత శరాలు. గురు బ్రహ్మణులపై గల భక్తి శ్రద్ధలే కవచం.
విభీషణా! ధర్మ సమన్వితమైన ఇలాంటి రధమే విజయ రధం. దీన్ని అధిరోహించి ఉన్న రధికుణ్ణి జయించే శక్తి గల శత్రువు ఎక్కడా ఉండడు. ఈ రధం పై అధిరోహించి ఉన్న వీరుణ్ణి జనన మరణాలనే దుర్జయ శత్రువులూ జయించలేవు. ఇలాంటి రధం మీద ఉన్న నా ముందు రావణుడు అతని శక్తి పరాజయం కాక తప్పదు"

తులసీ రామాయణం నుంచి (ఈనాడు అంతర్యామి శీర్షికలో ఈరోజే వచ్చింది) - కాలిపు వీరభద్రుడు